ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 12:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి..జనగణన ప్రతుల దహనం.. బీసీ సంఘాల నిరసన.

జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి..జనగణన ప్రతుల దహనం.. బీసీ సంఘాల నిరసన.

అర్జున్ సమాచారం. ఆగస్టు 20. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల, ఆగస్టు 20:కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీ కాలాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన ప్రతులను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ బీసీ హక్కుల పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ జనగణనలో బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ హామీని విస్మరించి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2025 ఏప్రిల్ 1న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపడతామని ప్రకటించినప్పటికీ, కుటుంబాల తొలి దశ లెక్కింపులో ఓబీసీల వివరాలను నమోదు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని అన్నారు.
రెండో దశలో కులగణన చేపడతామని ప్రకటించడం వల్ల బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. కులగణన చేపడితే ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లను పెంచాలన్న డిమాండ్ ముందుకు వస్తుందనే ఉద్దేశంతోనే ఓబీసీల లెక్కింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ కూడా బలపడుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
బీసీల ఉద్యమ ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి జనగణనలో ఓబీసీ కాలాన్ని చేర్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఉధృతంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు.
అనంతరం జనగణన ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, ప్రజావాణి సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ వర్మ, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం, సీనియర్ న్యాయవాది కర్రె లచ్చన్న, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సామాజిక మాధ్యమ విభాగం ప్రతినిధి మహమ్మద్ లతీఫ్, న్యాయవాది సురేందర్ చారి, బీసీ నాయకులు చంద్రగిరి చంద్రమౌళి, పెద్దల చంద్రకాంత్, అంకం సతీష్, పడాల శివతేజ, ఆరండుల రాజేశం, బూర రవీందర్, బొంగోని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.